Home  »  Bollywood News  »  రణవీర్ సింగ్‌పై ఇండస్ట్రీ బ్యాన్.. 'ప్రళయ్' షూటింగ్‌కు బ్రేక్?

Updated : May 25, 2026

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. 'ధురంధర్', 'ధురంధర్ 2' వంటి  సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న రణవీర్.. ఇప్పుడు ఒక ఊహించని ఇండస్ట్రీ బ్యాన్‌ను ఎదుర్కొంటున్నారు. తన తదుపరి భారీ చిత్రం 'ప్రళయ్' కోసం సిద్ధమవుతున్న తరుణంలో, సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సంఘాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడం పరిశ్రమలో సంచలనంగా మారింది. లిమిట్స్ దాటిన ఈ వివాదానికి అసలు కారణం.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్‌తో రణవీర్‌కు వచ్చిన మనస్పర్థలేనని తెలుస్తోంది.

ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన 'డాన్ 3' (Don 3) ప్రాజెక్ట్ నుండి రణవీర్ సింగ్ హఠాత్తుగా తప్పుకోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణం. సినిమా షూటింగ్ ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందు రణవీర్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేసినట్లు సమాచారం. సాధారణంగా ఈ దశలో సెట్ నిర్మాణం, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), ఎడిటింగ్ ప్రిపరేషన్స్ వంటి ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం నిర్మాతలు భారీగా నిధులు ఖర్చు చేస్తారు. ఎంతో ఫండ్స్ లాక్ అయిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి రణవీర్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో ఫర్హాన్ అక్తర్ టీమ్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.

నష్టపరిహారంగా రణవీర్ తదుపరి చిత్రం 'ప్రళయ్' లాభాల నుండి ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని మొదట అనుకున్నప్పటికీ, ఫర్హాన్ అక్తర్ అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రీ-ప్రొడక్షన్ ఖర్చుల కింద రూ. 45 కోట్ల పరిహారం కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆర్థిక వివాదాన్ని పరిష్కరించడానికి ఇండస్ట్రీ సంఘాలైన ఐఎఫ్‌టీడీఏ (IFTDA), ఎఫ్‌డబ్ల్యూఐసీఈ (FWICE) రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించాయి. అయితే, ఈ చర్చలపై రణవీర్ సింగ్ స్పందించలేదు. పైగా, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే పరిధి ఇండస్ట్రీ ఫెడరేషన్లకు లేదంటూ రణవీర్ టీమ్ సమాధానం ఇవ్వడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది.

దీనిని తీవ్రంగా పరిగణించిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ (FWICE), రణవీర్ సింగ్‌పై కఠినమైన 'నాన్-కోఆపరేషన్' ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లు, లైట్ మెన్, స్పాట్ బాయ్స్ వంటి ఏ సాంకేతిక నిపుణుడు కూడా రణవీర్ సినిమాల్లో పని చేయకూడదు. సినిమాలతో పాటు ఎలాంటి కమర్షియల్ యాడ్స్ షూటింగుల్లోనూ ఆయనకు సాంకేతిక సహకారం అందించకూడదు. పెద్ద ప్రాజెక్టులు అకస్మాత్తుగా రద్దయినప్పుడు దినసరి కూలీలు, టెక్నీషియన్ల జీవనోపాధి దెబ్బతింటుందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ బ్యాన్ కారణంగా రణవీర్ సింగ్ రాబోయే ప్రాజెక్ట్ 'ప్రళయ్' తీవ్రమైన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. టెక్నికల్ క్రూ సహకారం లేకపోతే ఏ సినిమా షూటింగ్ ముందుకు సాగడం అసాధ్యం. అయితే, ఇంతటి కఠినమైన ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ, ఫర్హాన్ అక్తర్ టీమ్ మాత్రం ఈ ఆర్థిక వివాదాన్ని శాంతియుత చర్చల ద్వారా ముగించడానికి ఇంకా తలుపులు తెరిచే ఉంచడం గమనార్హం. రణవీర్ సింగ్ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.